సమ్మర్ సీజన్ లో కీరదోసకి మస్త్ డిమాండ్. కీరదోసని అట్లనే కట్ చేసుకుని తినడమే కాకుండా బ్రేక్ ఫాస్ట్ లో దోసెలుగా.. ఇంకా కూర కూడా ట్రై చేయొచ్చు.ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .!
కీర దోశె తయారీకి కావలసినవి
- బియ్యం-ఒక కప్పు
- ఉప్పు- రుచికి సరిపడా
- కీర దోసకాయ ముక్కలు - ముప్పావు కప్పు
- కొబ్బరి తురుము - రెండు టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి ఇష్టపడితే - రెండు
- కొత్తిమీర -కొంచెం
- జీలకర్ర- అరటీస్పూన్
- నూనె (అవసరమనుకుంటే)
కీరా దోశె తయారీ విధానం
బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి.కీరదోసకాయను పెద్ద ముక్కలుగా తరగాలి..
కీరదోసకాయ, కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పులను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేయాలి.అందులో నానబెట్టిన బియ్యం వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి సరిపడా నీళ్లు అంటే.. పాలను గరిటెతో పోస్తే ఎంతజారుగా ఉంటాయో అలా ఉండేలా కలపాలి.
నాన్ స్టిక్ పాన్ లేదా తవా స్టవ్ మీద పెట్టి వేడిచేసి.. దోశె పిండిని వేసి, పాన్ అంతటా పరుచుకునేలా గుండ్రంగా తిప్పాలి. పాన్ అంతటా పలుచటి పొరలా పిండి పరుచుకుంటుంది. కావాలనుకుంటే నూనె చుక్కలు చల్లొచ్చు.
►ALSO READ | తలస్నానం ఎలా చేయాలి.. ఏ షాంపూను ఎలా వాడాలో తెలుసుకోండి..లేదంటే బట్టతల గ్యారంటీ..!
పాన్ మీద మూత పెట్టి మాదిరి మంట మీద వేడిచేయాలి. దోశ పొరలా లేస్తుంది. పలుచగా ఉంటుంది కాబట్టి రెండోవైపు కాల్చాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా అట్లకాడతో తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని తినడమే. ఈ దోశను కొబ్బరి చట్నీ లేదా.. కారప్పొడి తేనెలతో ఉంటే చాలా రుచిగా ఉంటుంది.
నోట్. ఈ దోశెలను తియ్యగా, కారంగా లేదా సాదాగా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. తియ్యగా కావాలంటే మిర్చికి బదులు బెల్లం కలపాలి. ఇందులో జీలకర్ర, కొత్తిమీరలు వేయొద్దు. సాదా దోశ అయితే బియ్యం, కీరదోనే కొబ్బరి, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి.
కీరా కూర తయారీకి కావలసినవి
పెద్ద కీరదోసకాయలు (తరిగి) రెండు
ఇంగువ- పావు టీస్పూన్
కరివేపాకు రెమ్మలు -కొన్ని
ఉల్లిగడ్డ (తరిగి)- ఒకటి
జీలకర్ర - పావు టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
కారం - ఒక టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
ధనియాల పొడి - అర టీస్పూన్
చక్కెర-పావు టీస్పూన్
కొత్తమీర -కొంచెం
నిమ్మరసం అరటీస్పూన్
పుట్నాల పప్పు- అర టేబుల్ స్పూన్
నూనె - రెండు టీస్పూన్లు
ఆవాలు - అరటీస్పూన్
కీరా కూర తయారీ విధానం
పాన్ లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేయాలి .ఆవాలు చిటపటమంటున్నప్పుడు పసుపు, ఉల్లిగడ్డ కరివేపాకు వేసి కాసేపు వేగించాలి.తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి.
తరువాత కీరదోసకాయ ముక్కలు, ఉప్పు, పంచదార వేసి రెండు నుంచి ఐదు నిమిషాలు ఉడికాక పుట్నాల పప్పు పొడి చల్లి మధ్యమధ్యలో కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.కొత్తిమీర పైన చల్లితే కీరదోసకాయ కూర రెడీ. . .
-వెలుగు,లైఫ్–
